
ఇకపై ఛాలెంజింగ్ పాత్రలే చేయాలనుకుంటున్నా: సమంత
‘‘ఇప్పటి వరకు గ్లామర్ పాత్రలే ఎక్కువగా చేశాను. ఇకపై ఛాలెంజింగ్ పాత్రలే చేయాలనుకుంటున్నా”నని ప్రముఖ హీరోయిన్ సమంత అన్నారు. ఇకపై కొన్ని పాత్రలు పోషించడానికి తాను సమర్థురాలిని కాదని ఆమె పేర్కొన్నారు. నాగ చైతన్యతో విడాకులు తీసుకున్న తర్వాత సమంత కెరీర్ అంతంత మాత్రంగానే సాగుతుందని ఇండస్ట్రీ వర్గాల్లో అనేక గుసగుసలు వినిపించాయి. అయితే ఇప్పుడు ఆమె హిందీ సినిమాల్లోనూ తన ప్రతిభను నిరూపించుకునేందుకు సిద్ధమయ్యారు. తాజాగా నేషనల్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె అనేక ఆసక్తికర విషయాలను వెల్లడించారు.
‘‘నటిగా సౌత్ ఇండియాలో నాకు మంచి స్థానం ఉంది. అది నాకు చాలా సంతృప్తినిచ్చింది. అయితే గత రెండేళ్లలో సినిమా రంగంలో చాలా మార్పులొచ్చాయి. మార్పులకు తగ్గట్లు నడుచుకోవాలనుకుంటున్నా. వెబ్ సిరీస్‌లు చేయాలన్న ఆలోచన గతంలో లేదు. దర్శకులు రాజ్ అండ్ డీకే నా ఆలోచనల్లో మార్పు తీసుకొచ్చారు. వారు చెప్పిన కథ వినగానే చేయను అనడానికి నాకు కారణం కనిపించలేదు. రాజీ పాత్రను నమ్మి చేశాను కాబట్టే ఊహించిన దానికంటే ఎక్కువగా ప్రశంసలు దక్కాయి. ‘ఫ్యామిలీ మ్యాన్’తో కొత్త సవాళ్లను స్వీకరించగలననే నమ్మకం ఏర్పడింది. త్వరలోనే బాలీవుడ్ లోకి అడుగు పట్టాలనుకుంటున్నా’’ అని సమంత అన్నారు.